కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి చూపించిన విలయానికి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు, అధికారులతోపాటు సాధారణ పౌరులు కూడా.. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే శిథిలాల కింద చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిని.. రెస్క్యూ సిబ్బంది, స్థానికులు కాపాడి ఆస్పత్రులకు తరలించారు. అయితే ఈ విషాద ఘటనలో సహాయం అందించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. ఆచూకీ గల్లంతు కావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడి సూపర్ హీరో అనిపించుకున్న ఆ వ్యక్తి కనిపించకుండా పోవడం సంచనలంగా మారింది.
వయనాడ్ జిల్లాలోని చూరాల్మలకు చెందిన ప్రజీష్.. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే కొందరిని రక్షించేందుకు ప్రాణాలకు సైతం తెగించి కాపాడాడు. కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నాడు. అయితే ఇప్పుడు ప్రజీష్ ఆచూకీ గల్లంతు కావడంతో చురాల్మల ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజీష్ గురించి, అతనికి ఉన్న సేవా గుణం గురించి అక్కడి వారు మీడియాకు వెల్లడిస్తున్నారు.
అయితే కొండచరియలు విరిగపడ్డాయని తెలియగానే ప్రజీష్.. సహాయక చర్యల్లో పాల్గొన్నాడని స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఏ మాత్రం ఆలోచించకుండా ప్రజీష్ సాయం చేస్తాడని పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడిన ముండక్కై ప్రాంతంలో బాధితులను రక్షించేందుకు ప్రమాదకర కొండ ప్రాంత మార్గంలో ప్రజీష్ జీప్‌లో వెళ్లాడని.. అలా వెళ్లి 2 సార్లు కొందర్ని కాపాడి ప్రాణాలతో బయటికి తీసుకువచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడని.. అయితే అంతలోనే మరో ఫోన్ కాల్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మళ్లీ కొండ ప్రాంతానికి జీప్‌లో వెళ్లిన ప్రజీష్ తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రజీష్ వెళ్లిన జీప్.. చూరాల్మల ప్రాంతంలో ధ్వంసమై కనిపించిందని.. కానీ అతడి ఆచూకీ మాత్రం గల్లంతైందని స్థానికులు వివరించారు. ప్రజీష్ అంటే తమ గ్రామంలో అందరికీ ఇష్టమని.. ఎవరి ఇళ్లలో ఎలాంటి కార్యక్రమం జరిగినా ముందుండి అన్ని పనులు చేస్తాడని వారు గుర్తు చేసుకున్నారు. తన కుమార్తె పెళ్లికి ప్రజీష్ చేసిన సాయం తాను ఎప్పటికీ మరిచిపోలేనని ఓ వ్యక్తి తెలిపారు. అయితే ఆ ప్రమాదకరమైన కొండ ప్రాంతానికి వెళ్లొద్దని తాము చెప్పినా ప్రజీష్ వినలేదని అతని స్నేహితులు వెల్లడించారు.
ముండక్కై ప్రాంతంలో చాలా మంది చిక్కుకుపోయారని.. వారిని రక్షించాలంటూ ప్రజీష్ వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రజీష్ మా సూపర్ హీరో అని.. ఇప్పుడు ఆ సూపర్ హీరో మా ముందు లేడు అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో ముండక్కై, చూరాల్‌మల ప్రాంతాల్లో వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకు 222 మృతదేహాలను వెలికితీయగా.. గల్లంతైనవారి సంఖ్య 180 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.