తనకు భద్రతను పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో మాజీ సీఎం వైఎస్ జగన్ వేసిన పిటిషన్ మీద.. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర రియాక్టయ్యారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర.. వైఎస్ జగన్ పిటిషన్ మీద స్పందించారు. వైఎస్ జగన్‌కు మాజీ ముఖ్యమంత్రులకు కల్పించే భద్రతను ఇస్తున్నట్లు చెప్పారు. అలా కాకుండా.. సీఎం స్థాయిలో భద్రతను కల్పించాలని వైఎస్ జగన్ అనడం అవివేకమని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ నుంచే ప్రజలకు సెక్యూరిటీ కావాలంటూ విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యేకు.. ముఖ్యమంత్రి తరహా సెక్యూరిటీ, ప్రధాని తరహా భద్రత ఉండదనే విషయం తెలుసుకోవాలని సూచించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే వైఎస్ జగన్‌కు శవం కావాలంటూ కొల్లు రవీంద్ర సెటైర్లు వేశారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు అధికారులు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారని.. వైసీపీ నేతల మాదిరిగా తప్పుడు సమాచారం కోసం కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నానిపైనా కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని దాచింది పేర్నినాని అనే ఆనుమానాలు కలుగుతున్నాయన్నారు. పేర్ని నానికి త్వరలోనే రెడ్ బుక్ పవర్ ఏంటో తెలుస్తుందంటూ కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పేర్ని నాని చేసిన పాపాలు అన్నింటికీ త్వరలోనే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం తన భద్రతను తగ్గించిందంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు, జూన్ మూడో తేదీ నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద ఏపీ హైకోర్టు త్వరలోనే విచారణ జరిపే అవకాశం ఉంది. అయితే వైఎస్ జగన్ భద్రత కుదించలేదని అధికారులు చెప్తున్నారు. మాజీ సీఎంకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రులకు కల్పించే అదనపు భద్రతను మాత్రమే కుదించినట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ పిటిషన్ మీద టీడీపీ నేతలు స్పందిస్తున్నారు.