తిరుమల శ్రీవారి తోమాల సేవ పేరుతో సిఫార్సు లేఖలను విక్రయించారంటూ చేసిన టీడీపీ నేత ఫిర్యాదుతో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ మీద కేసు నమోదైంది. గుంటూరు వాసుల నుంచి తోమాల సేవ సిఫార్సు లేఖలకు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారంటూ టీడీపీ నేత చిట్టిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరులోని అరండల్‌పేట పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు చేశారు. భరత్ పీఆర్వో మల్లికార్జునపైనా కూడా కేసు నమోదైంది.
మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద.. వైసీపీ తరుపున భరత్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు చేతిలో 48 వేలకు పైగా ఓట్ల తేడాతో భరత్ ఓడిపోయారు. చంద్రబాబుకు లక్షా 21 వేల 929 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థిగా ఉన్న భరత్‌కు 73,923 ఓట్లు వచ్చాయి. అయితే చంద్రబాబుకు బలమైన పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. భరత్‌కు పూర్తి సహకారం అందించారు.2021లో స్థానిక సంస్థల కోటాలో భరత్‌ను ఎమ్మెల్సీని చేశారు. 2027 డిసెంబర్ వరకూ భరత్ పదవీ కాలం కొనసాగనుంది.
ఇక ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ కుప్పం అభివృద్ధికి నిధులు కూడా కేటాయించారు. భరత్ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించిన వైఎస్ జగన్.. కుప్పంలో ప్రచారం కూడా చేశారు. కుప్పం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే భరత్‌ను మంత్రిని చేస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే కుప్పం ప్రజలు మరోసారి చంద్రబాబుపై నమ్మకం ఉంచారు. వరుసగా ఎనిమిదోసారి ఆయనను గెలిపించారు. ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న కుప్పం వైసీపీకి భరత్ మీద కేసు నమోదు కావటం ఇబ్బందికరమేనని చెప్పొచ్చు.
కుప్పంలో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధమవుతున్నారు. కుప్పం మున్సిపాలిటీలోని ఐదుగురు కౌన్సిలర్లు, 14 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరగా.. రాబోయే రోజుల్లో మరికొంతమంది చేరతారని వార్తలు వస్తున్నాయి. అలాగే కుప్పంలోని వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూడా మూసేసిన పరిస్థితి. ఇక ఇప్పుడు కుప్పం వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న భరత్ మీద కూడా పోలీసులు కేసు నమోదుచేశారు.