ఏపీలో నూతన మద్యం పాలసీ రూపకల్పన దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు సైతం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తాము అధికారంలోకి వస్తే నూతన మద్యం విధానం తెస్తామని.. నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న పద్ధతిని చంద్రబాబు ఫాలో అవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
మద్యం దుకాణాల్లో గౌడ, ఈడిగ సామాజికవర్గాలు రిజర్వేషన్లు ఇవ్వాలనే యోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. గౌడ, ఈడిగ సామాజికవర్గాలు కల్లు విక్రయాలకు ప్రాధాన్యం ఇస్తారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ వర్గాలకు మద్యం షాపుల్లో 15 నుంచి 20 శాతం షాపులను కేటాయించే అంశంపై ఆలోచనలు చేయాలని సూచించారు. దీంతో తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా మద్యం దుకాణాల్లో గౌడ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తారనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం షాపులు కేటాయిస్తున్నారు. ఈ ప్రకారమే ఏపీలోనూ గౌడ, ఈడిగ కులస్థులకు మద్యం షాపులను కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నూతన మద్యం విధానం కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులను నియమించింది. ఈ బృందాలు కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలలో పర్యటిస్తాయి. అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న మద్యం విధానాలను పరిశీలిస్తాయి. బార్లు, మద్యం దుకాణాల్లో ధరలు, చెల్లింపుల విధానం, మద్యం క్వాలిటీలను అధ్యయనం చేస్తాయి. ఈ విషయాలను అన్నింటిపైనా ఆగస్ట్ 12వ తేదీలోగా ప్రభుత్వానికి ఈ నాలుగు బృందాలు నివేదిక సమర్పిస్తాయి. ఈ నివేదికల అధ్యయనం తర్వాత ప్రభుత్వం నూతన మద్యం పాలసీకి రూపకల్పన చేయనుంది. ఈ విధానాన్ని అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని భావిస్తోంది.