గత ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ప్రవేశపెట్టిన బాత్‌రూమ్‌ల ఫొటోల యాప్‌కు చంద్రబాబు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. బాత్‌రూమ్ ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసే యాప్‌ను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో అనేక రకాల యాప్‌లు తీసుకొచ్చింది. ప్రతిరోజూ టీచర్లు ఆ యాప్‌లు వినియోగించి సమాచారం అప్‌లోడ్ చేసే విధానాన్ని ప్రారంభించింది. అందులో ఒకటి బాత్‌రూమ్ ఫొటోల క్యాప్చరింగ్ యాప్. ప్రతిరోజూ ఉదయం పాఠశాలకు రాగానే టీచర్లు బాత్‌రూమ్‌ల పరిశుభ్రతను తెలిపేలా వాటి ఫొటోలను తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇలా తమతో బాత్‌రూమ్‌ల ఫొటోలు తీయించడం అవమానకరంగా ఉందని, ఈ ఒక్క యాప్‌ను వెంటనే తొలగించాలని అప్పట్లో టీచర్లు గగ్గోలు పెట్టారు. కానీ ప్రభుత్వం వినిపించుకోలేదు. అయితే, ఇది టీచర్లను అవమానించినట్లుగా ఉందని భావించిన టీడీపీ ప్రభుత్వం ఆ యాప్‌ను పూర్తిగా తొలగించింది. యాప్‌ను తొలగించినందుకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి, నోబుల్ టీచర్స్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకట్రావు, బి.హైమారావు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.