ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తప్పు పట్టారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యంగ విరుద్ధమని, దేశ సమగ్రతకు విరుద్ధంగా సుప్రీం కోర్టు తీర్పు ఉందని మాజీ కేంద్ర మంత్రి, చింతా మోహన్ విమర్శించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం తీర్పు భారత అఖండతను దెబ్బతీసేలా ఉందని, దేశ పౌరుడిగా ధర్మాసనం తీర్పును వ్యతిరేకిస్తున్నానని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు దేశం పేదరికం, కులాల గురించి తెలుసా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు సంపన్నులని, వారు పేద వర్గాల గురించి తీర్పు ఇస్తారా? అని చింతా మోహన్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎప్పుడన్న దళిత వాడల్లో తిరిగారా? అని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణపై న్యాయస్థానం అనాలోచిత, తల తిక్క తీర్పు ఇచ్చిందన్నారు. దేశంలో వెయ్యి ఉపకులాలు ఉన్నాయని.. ఎలా వర్గీకరణ చేస్తారని అన్నారు. వర్గీకరణపై కమిషన్ వేయాలని, కేంద్ర ప్రభుత్వానికి.. రాష్ట్రాలకు తలకాయ లేదని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో క్రిమిలేయర్ ఉందా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఉంటే.. అందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉండేది ఐదుగురేనా?.. మిగిలినవారు ఉత్తర భారత దేశం నుంచి వస్తారా? అని చింతా మోహన్ ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఐదుగురు న్యాయమూర్తులు ఉన్నారని, ఢిల్లీ, ముంబై నుంచి 10 మంది న్యాయమూర్తులు ఉంటారా? అన్నారు. ఇది క్రిమిలేయరా ? ఇక్కడ వర్గీకరణ ఉందన్నారు. దేశ సమైక్యతను దెబ్బతీసేవిధంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. రిజర్వేషన్లు జోలికి మోదీ వెళ్ళారని, షేక్ హసీనాకు పట్టిన గతి పట్టకుండా కేంద్రం రిజర్వేషన్ల జోలికి వెళ్ళొద్దని చింతా మోహన్ మరొకసారి సూచించారు.