గ్రామాల అభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. పెద్దవడుగూరు మండలంలోని కాశేపల్లి, గుత్తిఅనంతపురం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. కాశేపల్లిలో తాగునీటి సమస్య ఉండడంతోపాటు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గుత్తి అనంతపురం ప్రధాన రహదారి శిథిలావస్థకు చేరుకోవడంతో డ్రైనేజీ నీరు రహదారిపై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోందని విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలన్ని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మిడుతూరు గ్రామం వద్ద నార్త్‌కెనాల్‌లో విరివిగా పిచ్చిమొక్కలు పెరగడంతో రైతులకు సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కన్వీనర్ కొండూరు కేశవరెడ్డి, ఎంపీటీసీ మెంబరు చిన్నగోవిందు, కార్యకర్తలు ఉన్నారు.