ఒంగోలు మండల కేంద్రమైన సింగరాయకొండ గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి, అక్రమాలను నిగ్గుతేల్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. పంచాయతీలో నిధులు పెద్దఎత్తున దారిమళ్లించినట్లు అనేక ఆరోపణలు వచ్చినా గత వైసీపీ పాలనలో పట్టించుకున్న పరిస్థితి లేదు. కార్యదర్శులతో సర్పంచ్ కుమ్మక్కై రూ.46లక్షలకుపైగా పంచాయతీ నిధులను దారిమళ్లించారని జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షుడు రాజేష్ ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. అయితే వైసీపీకి చెందిన సర్పంచ్ కావడంతో ఏడాదిగా అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవల మరోసారి రాజేష్ మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆమె ఆరా తీయగా ఇప్పటికే ఒంగోలు, కనిగిరి డీఎల్పీవోలు విచారణ నిర్వహించినట్లు తేలింది. దీంతో ఆ నివేదికలను అందజేయాలని ఆమె ఆదేశించారు. ఇద్దరు డీఎల్పీవోలు విచారించి ఏడాది అయినా నివేదికను అందజేయకపోవడంతో వారిద్దరికీ నోటీసులను ఇచ్చారు.