రాష్ట్రంలోని ప్రాజెక్టులు రెండేళ్లుగా జలకళ లేక వెలవెలబోయాయి. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయాయి. కానీ.. ఈ ఏడాది ప్రకృతి కరుణించింది. రాష్ట్రంలో కురిసిన వానలు... ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలకు వరద భారీగా రావడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. శ్రీశైలం, నాగార్జన సాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. సాగర్, పులిచింతల ప్రాజెక్టులను దాటి కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీలోకి పరుగులు పెట్టాయి. ఎగువ నుంచి 3,61,455 క్యూసెక్కులు శ్రీశైలంలోకి వస్తుండగా.. డ్యామ్ పది గేట్లను ఎత్తి 4,02,076 క్యూసెక్కులు దిగువన నాగర్జున సాగర్‌లోకి పంపుతున్నారు. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు సాగర్ గేట్లను ఎత్తివేశారు. తొలుత 11 గేట్లను మాత్రమే ఎత్తగా... సాయంత్రానికి 16 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,53,684 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు సాగర్‌కు పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 582 అడుగులకు చేరింది. సాగర్‌కు 3,23,748 క్యూసెక్కుల వరద వస్తుంటే.. క్రస్ట్ గేట్ల ద్వారా 1,53,684 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,516 కూసెక్కులు మొత్తం 1,94,200 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద పులిచింతల ప్రాజెక్టుకు చేరుతోంది. దీంతో ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజీకి 26,083 కూసెక్కులు విడుదల చేస్తున్నారు.