వచ్చే రెండున్నరేళ్లల్లో నియోజకవర్గంలోని అన్ని చెరువులకు బీటీపీ ద్వారా నీరందిస్తామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆయన తన స్వగృహంలో వేద పండితుల చేత ఆశీర్వాదాలు పొందారు. తర్వాత స్థానిక వాల్మీకి సర్కిల్, టీ సర్కిల్‌లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేకులను కట్ చేశారు. అలాగే పార్టీ శ్రేణులతో కలిసి టీ సర్కిల్ నుంచి నగర వనం వరకు గో గ్రీన ర్యాలీ నిర్వహించారు. నగర వనంలో విద్యార్థులు, అటవీ సిబ్బంది, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. తర్వాత మార్కెట్ యార్డులో అభయ ఫౌండేషన వ్యవస్థాపక అధ్యక్షుడు బాలచంద్ర ఆధ్వర్యంలో టైలరింగ్, డ్రైవింగ్ ఉచిత శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. తన మొదటి నెల జీతాన్ని అభయ ఫౌండేషనకు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రజావేదిక వద్ద వందలాది అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. ప్రజావేదిక వద్ద మెగారక్తదాన శిబిరాన్ని నిర్వహించగా.. 1500 మందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే రెండున్నరేళ్లల్లో సీఎం చంద్రబాబు సహకారంతో భైరవాని తిప్ప ప్రాజెక్టు (బీటీపీ) ద్వారా నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు అందిస్తాని తెలిపారు. అదేవిధంగా అన్ని గ్రామాలకు తారు రోడ్లు వేస్తామన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అందరి సహకారంతో ఆదర్శంగా తీరుదిద్దుతానని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో పాలకులు దోచుకోవడమే తప్ప అభివృద్ధి పనులు చేయలేదని ఈ సందర్భంగా విమర్శించారు. సమావేశం అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే అల్లుడు అవినాష్, ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.