ప్రజలకు ఇబ్బంది లేకుండా.. కొందరి సమస్యలైనా పరిష్కరించే దిశగా కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. కొందరు ప్రజలు చిన్న చిన్న సమస్యలపై తమ దగ్గరకు వస్తున్నారని.. నిధులు లేని కారణంగా ఆ సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ సదస్సులో ప్రస్తావించారు. వెంటనే స్పందించిన చంద్రబాబు.. సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాకు రూ.5 కోట్లు కేటాయిస్తామని.. అవసరమైతే ఇంకా మంజూరు చేస్తామని ప్రకటించారు. ఏవైనా అత్యవసరమైన పనులు ఉంటే వెంటనే చేయాలన్నారు.
రాష్ట్రంలో మంత్రులకు ఇద్దరేసి చొప్పున పీఆర్వోలను కేటాయించామన్నారు చంద్రబాబు. కలెక్టర్లు కూడా అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ఏవైనా తప్పుడు వార్తలు వచ్చినప్పుడు ప్రజలకు వాస్తవాలు వివరించడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. 'మనం చేసే మంచి పనుల పైనా వివరించాలి.. వక్రీకరిస్తూ వార్తలు వస్తే చట్టపరంగా ఏం చేయాలో ఆలోచిద్దాం’ అంటూ ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. బాగా పనిచేసే జిల్లా కలెక్టర్లను కచ్చితంగా ప్రోత్సహిస్తామని.. అవసరమైతే పాలనలో స్థిరత్వం కోసం ఐదారేళ్లూ వారిని ఆ జిల్లాల్లోనే కొనసాగిస్తామని చెప్పారు. సమర్థంగా పనిచేయని కలెక్టర్లకు ఆ గ్యారెంటీ ఇవ్వలేమన్నారు.
కొత్తగా అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలుండవన్నారు చంద్రబాబు. అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని.. మరోసారి తప్పు చేయాలంటే భయపడేలా చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, కలెక్టర్లు, సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. కచ్చితంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిందేనని సూచించారు. అక్కడ నుంచి వచ్చే ఆలోచనలే ఎన్నో మార్పులకు కారణం అవుతాయన్నారు. ప్రతి జిల్లాకు రెండో సంయుక్త కలెక్టర్‌ను కేటాయిస్తామని.. కచ్చితంగా మూడు నెలలకోసారి కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేసి సమీక్ష చేద్దామన్నారు. రోజులు, గంటల తరబడి సమావేశాలు ఉండవని క్లారిటీ ఇచ్చారు.
ప్రతి అధికారి పేదల పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. ఆర్థిక అంశాలతో సంబంధం లేని వాటిని పూర్తిచేయాలని కలెక్టర్లకు సూచించారు. తాను ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి భారీగా అర్జీలు వస్తున్నాయని.. తాను టీడీపీ కార్యాలయానికి వెళ్తే మూడు గంటలపాటు ఉంటే అర్జీలు భారీగా వచ్చాయన్నారు. ఐదు వేల ఫిర్యాదులు వస్తే.. అందులో సంగం భూమికి సంబంధించిన సమస్యలే ఉన్నాయన్నారు. వీటి పరిష్కారంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు.
కలెక్టర్లు, ఎస్పీల మధ్య సమన్వయం చాలా అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందరం కలిసి ప్రజల్ని మెప్పించాలని.. తానెక్కడా రాజకీయ కక్షసాధింపు చేయనన్నారు.. అలాగని తప్పులు చేసిన వారిని వదిలిపెట్టను అని కూడా చెప్పారు. చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి భోజనం చేశారు.. దాదాపు రెండు గంటలపాటు వారితో ముచ్చటిస్తూ గడిపారు. అలాగే ప్రభుత్వం త్వరలోనే మద్యం, ఇండస్ట్రియల్, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, యూత్, స్పోర్ట్స్, తదితర పాలసీలు తీసుకొస్తామన్నారు.