విజయ డైరీ ద్వారా పాడి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ సోమవారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల నుంచి పాల సేకరణకు గత ప్రభుత్వం అమూల్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈనెల 10 నుంచి రద్దు చేయనుంది. దీంతో పాడి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. అనంతపురం జిల్లాలో వందకు పైగా కేంద్రాల ద్వారా పాల సేకరణ చేయాలని అమూల్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుని ఏడు కేంద్రాల ద్వారా పాలు సేకరిస్తోందని, ఇలా సేకరించిన పాలల్లో ప్రతిరోజు దాదాపు 60వేల లీటర్లు రాయలసీమ జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు పంపుతున్నారన్నారు. అమూల్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో అంగన్వాడీ కేంద్రాలకు కర్ణాటక నుంచి పాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయని, ఇది పాడిరైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. ఇప్పటికే పశువుల ధరలతోపాటు దానా, గడ్డి, పశువుల వైద్యం ఖర్చులు పెరిగి పాడిరైతులు నష్టాల్లో ఉన్నారన్నారనీ, కాబట్టి ప్రభుత్వం విజయ డెయిరీ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, పాలను సేకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.