వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ భేటీ గురించిన వివరాలను మీడియాకు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం 3 గంటల పాటు జరిగిందని అన్నారు. రాజధాని, పోలవరం నిర్మాణం, నామినేటెడ్ పోస్టులు, నదుల అనుసంధానంపై చర్చించామని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. నీరు, చెట్టు బిల్లులపై చంద్రబాబు ఆరా తీశారని చెప్పారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన టీడీపీ నాయకులు, ప్రజలకు పొలిట్ బ్యూరో తరఫున ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ విధ్వంసక పాలన, ఫేక్ ప్రచారంపై సమర్థవంతంగా తిప్పి కొట్టాలని నిర్ణయం తీసుకున్నామని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.