ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ ఫ్లో .. 2,67,111 క్యూసెక్కులు ఉండగా.. కాలువలకు..13,991 క్యూసెక్కుల క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. అలాగే 60 గేట్లు ఆరు అడుగుల మేర, 10 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి.. 2,53,120 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానదీ (Krishna River) పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద పెరుగుతోంది. దీంతో కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని సూచించారు. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ అన్నారు. కాగా ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా కనిపిస్తోంది. బ్యారేజీ 60 గేట్లను ఆరు అడుగులు, 10 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి లక్షా 41 వేల 856 క్యూసెక్కుల నీరు వస్తోంది. వజిలేపల్లి నుంచి లక్షా25వేల544 క్యూసెక్కులు, పాలేరు నుంచి 65, కీసర నుంచి 16,276 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీని నుంచి లక్షా 37 వేల 450 నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 13,991 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. కేఈబీకి 1,407, బందరు కాల్వకు 1,515, రైవస్ కాల్వకు 4,521, కేడబ్ల్యూకు 6,034 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు కాల్వకు నీటి విడుదలను నిలుపుదల చేశారు. మరో నాలుగు రోజుల పాటు బ్యారేజీకి ఇన్‌ఫ్లో ఉంటుందని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.