ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైశంకర్‌తో భేటీ తర్వాత వెనక్కి తగ్గిన ముయిజ్జు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 10:57 PM

లక్షద్వీప్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన తర్వాత.. భారత్‌పై, మోదీపై మాల్దీవులు మంత్రులు చేసిన వ్యాఖ్యలు.. గతేడాది ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి మహ్మద్ ముయిజ్జు మన దేశం పట్ల అనుసరిస్తున్న వైఖరితో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మొదటి నుంచి భారత్ వ్యతిరేక వైఖరి.. చైనాకు అనుకూల వైఖరి కలిగి ఉండే మహ్మద్ ముయిజ్జు.. మన దేశం పట్ల ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. అయితే కాలం గడిచే కొద్ది మాల్దీవులు సాయం కోసం భారత్ వైపు వస్తోంది. మహ్మద్ ముయిజ్జు వైఖరిలో కూడా క్రమంగా మార్పు వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విదేశాంగ మంత్రి జై శంకర్‌, మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భేటీ అయ్యారు. ఆ తర్వాత భారత్ తమకు ఎప్పటికీ మిత్రదేశమని మహ్మద్ ముయిజ్జు ప్రకటించడం గమనార్హం.


మాల్దీవులు సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్‌ ఒకటని.. అంతేకాకుండా ముఖ్య భాగస్వామి అని మహ్మద్ ముయిజ్జు వ్యాఖ్యానించారు. మాల్దీవులకు అవసరం అయినపుడల్లా సాయం చేయడానికి భారత్ ముందు ఉంటుందని తెలిపారు. మాల్దీవులు అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహ్మద్ ముయిజ్జు తెలిపారు. భారత్ మాల్దీవులు మధ్య విభేదాలు తీవ్రం అవుతున్నాయని భావిస్తున్న వేళ.. ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ భారత్‌లో పర్యటించిన తర్వాత మార్పులు చోటు చేసుకుంటున్నాయి.


మోదీ లక్షద్వీప్ పర్యటనపై తమ దేశ నేతలు చేసిన వ్యాఖ్యలు తమ ప్రభుత్వ అభిప్రాయం కాదని.. అలాంటి వైఖరి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మాల్దీవులు విదేశాంగ మంత్రి చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవులు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మహ్మద్ ముయిజ్జుతో భేటీ అయ్యారు. పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం విధానంలో మాల్దీవులకు ముఖ్యపాత్ర ఉందని జైశంకర్ వెల్లడించారు.


మాల్దీవుల్లోని 28 ద్వీపాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల ఏర్పాట్లు పూర్తికావడంతో భారత్‌ సహకారం అందించింది. నిధుల కోసం ఎగ్జిమ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా.. వడ్డీ రాయితీతో అప్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన కార్యక్రమంలోనే మహ్మద్ ముయిజ్జు మాట్లాడారు. ఈ ప్రాజెక్టులు భారత్ మాల్దీవులు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మైలురాయి అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే భారత్‌తో ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాల్దీవులకు సహాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వం, ప్రజలకు మహ్మద్ ముయిజ్జు థ్యాంక్స్ చెప్పారు.


అయితే గతంలోనూ రుణ విముక్తి కోసం భారత్‌కు ముయిజ్జు విజ్ఞప్తి చేశారు. గతేడాది చివరి నాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్‌ డాలర్లు అప్పు పడింది. దీన్ని తిరిగి చెల్లించడంలో కొంత ఊరట కల్పించాలని కొన్ని నెలల క్రితం మాల్దీవులు విజ్ఞప్తి చేయగా.. భారత్‌ అంగీకరించింది. మరోవైపు ఇటీవల మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ కార్యక్రమానికి మహ్మద్ ముయిజ్జు హాజరయ్యారు. ఈ ఏడాది మొదట్లో లక్షద్వీప్‌లో మోదీ పర్యటించగా.. అప్పుడు మాల్దీవుల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొందరు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవులు.. ఆ మంత్రులపై వేటు వేసి.. ఆ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com