ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రంలో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. అన్న క్యాంటీన్ భవన నిర్మాణాల పనులు, మురుగు కాలువల్లో పూడికతీతతోపాటు పలు ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అన్న క్యాంటీన్ల భవన నిర్మాణ పనులు ఎంత మేరకు వచ్చాయి... కిచెన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 33 మున్సిపాలిటీల్లో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. మరో 83 క్యాంటీన్లు ఈనెలాఖరులోగా పూర్తి చేసేలా ముందుకెళ్లాలని మంత్రి ఆదేశించారు. మరో 20 క్యాంటీన్లు సెప్టెంబరు నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అన్ని మున్సిపాలిటీ డ్రెయిన్‌లలో పూడిక తీయాలని కమిషనర్లను మంత్రి ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోగా పనులు పూర్తి చేయాలన్నారు. టిడ్కో ఇళ్లకు మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని మంత్రి నారాయణ సూచించారు. సీఆర్‌డీఏ పరిధిలోని టిడ్కో ఇళ్లకు మౌలిక వసతుల కల్పన బాధ్యతను సీఆర్‌డీఏకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు.