గొర్రెలు, మేకలు జీవాల కాపరులకు ఎల్లప్పుడూ అండగా ఉండి, ప్రభుత్వ పరంగా చేయూతనందిస్తామని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య భరోసా ఇచ్చారు. చీరాల అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం ఏపీ గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం జిల్లా ప్రథమ మహాసభ జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే కొండయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జీవాల పెంపకందారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు. అందుకు ప్రభుత్వపరంగా అందిస్తున్న చేయూతను వివరించారు. భవిష్యత్‌లో కూటమి ప్రభుత్వంతో ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఎరికి ఏ అవసరం వచ్చినా తనను నేరుగా కలవచ్చని చెప్పారు. కార్యక్రమంలో పెంపకందారుల సంఘ ప్రతినిధులు, కాపరులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.