ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో దిగ్గజంగా పేరొందిన లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ మణిభాయ్ నాయక్ రిటైర్మెంట్ సందర్భంగా ఆయనకు ఆ కంపెనీ ఇచ్చిన మొత్తం తెలిస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే!! అవును, ఇటీవల సంస్థ నుంచి పదవి విరమణ పొందిన అనిల్ మణిభాయ్ నాయక్ కు ఎల్ అండ్ టీ సంస్థ.. గ్రాట్యూటి కింద రూ.55.038 కోట్లు ఇవ్వడంతోపాటు 1.50 కోట్ల పెన్షన్‌ని అందించింది. ఇవేకాకుండా గత 50 ఏళ్ల కాలంలో అనిల్ ఉపయోగించుకోని సెలవుల దినాలను నగదుగా మార్చుకోగా అతడికి అందిన మొత్తం అక్షరాల 19 కోట్ల 38 లక్షలుగా ఎల్ అండ్ టీ సంస్థ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది.
గత 5 దశాబ్ధాలకుపైగా సంస్థకు సేవలు అందించిన అనిల్ మణిభాయ్.. సంస్థను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని ఆ సంస్థ తమ వార్షిక నివేదికలో పేర్కొనడం విశేషం. 2017 సెప్టెంబర్ 30వ తేదీన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అనిల్ పదవి కాలం ముగిసినప్పటికీ.. ఆ తర్వాత ఆయనను మరో మూడేళ్లపాటు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కంపెనీ నియమించింది. అది ఆయన అంకిత భావానికి దక్కిన గౌరవం.