జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఒరిజనల్ అసైనీలకు లబ్ధి చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్లు మూడు నెలల పాటు నిలిపివేసినట్లు వివరించారు. అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకుని వైసీపీ నేతలు ఒరిజనల్ అసైనీల నుంచి అతి తక్కువ ధరలకే భూములను కొనేశారని విమర్శించారు. నిబంధనలకు విరుద్దంగా అనర్హులకు అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారని మండిపడ్డారు. కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ చేశారని చెప్పారు. ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ర్టేషన్లు చేశారని తెలిపారు. రిజిస్ర్టర్ అయిన అసైన్డ్ భూముల్లో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా గిఫ్ట్ డిడ్లుగా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని విమర్శలు చేశారు. 20 ఏళ్ల పరిమితి దాటని భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసినట్లు సమాచారముంది అని చెప్పారు. ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో జరిగిన తప్పులన్నింటీని సరిచేసేందుకే మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు మంత్రి వెల్లడించారు. ఒరిజనల్ అసైనీలకు వందకు వంద శాతం పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్రీ హోల్డ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.