కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. ఐదుగురిని కేబినెట్ నుంచి తొలగించి ఆరుగురి ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆప్తుడిగా ముద్ర పడిన నగరాభివృద్ధిశాఖ మంత్రి బైరతి సురేశ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్, అబ్కారి మంత్రి ఆర్‌బీ తిమ్మాపుర, సహకారశాఖ మంత్రి రాజణ్ణ, ప్రజా పాలన, హజ్‌శాఖ మంత్రి రహీంఖాన్‌ను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాగేంద్ర రాజీనామాతో ఒక స్థానం ఖాళీగా ఉంది. వీటితో కలిపి ఆరు స్థానాలు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే భద్రావతి ఎమ్మెల్యే సంగమేశ్‌కు కేబినెట్‌లో చోటు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భద్రావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే సంగమేశ్ మంత్రి అవుతారన్నారు.