పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024పై అధ్యయనానికి ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి బీజేపీ నేత జగదంబికా పాల్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఆగస్టు 8వ తేదీన ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపాదిత సవరణలపై స్వల్ప చర్చ జరిగింది. అనంతరం బిల్లుపై అధ్యయనానికి 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. వచ్చే శీతాకాల సమావేశాల తొలివారం చివరి రోజు నివేదిక అందించాలని గడువు విధించారు. కమిటీలో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించారు.