కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడతారు. అక్రమంగా అరెస్ట్‌లు చేస్తారు. అసలు ఈ కేసులో లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ...... కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా జోగి రమేష్‌ను టార్గెట్ చేశారు. చంద్రబాబు మీకు ఒకటే చెబుతున్నాం. 175 నియోజకవర్గాల్లో మా కార్యకర్తలందరినీ జైల్లో వేసుకోండి. మేం సిద్ధంగా ఉన్నాం. నీ తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌లు అన్నీ ఎదుర్కొంటాం. మీకు చేతనైంది చేసుకోండి. మిమ్మల్ని నిలదీయకుండా వదలం. మేం న్యాయ పోరాటం, ధర్మ పోరాటం చేస్తాం. కచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. రాజకీయ పోరాటం చేస్తాం. 2029నాటికి నీ ప్రభుత్వాన్ని పడదోయడానికి కావాల్సిన అన్ని పోరాటాలు చేస్తాం. మాపై తప్పుడు కేసులు పెట్టి వేధించాలనే లక్ష్యంతో మీరు పని చేస్తున్నారు. జోగి రమేష్‌కు పొలం అమ్మిన వారు ముద్దాయిలు కారు. కొనుక్కున్న వారు లేరు. మరి అలాంటప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులు మాత్రమే ముద్దాయిలా?. ఈ తప్పుడు కేసులపై న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తాం. నిజానికి అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు మనుషులే కొన్నారు. అయినా వారినేమీ అనరు. తండ్రిని ఏం చేయలేక పిల్లలపై కేసులు పెట్టి వేధించడం అంటే ఇదే. తాము నిజంగా తప్పు చేసి ఉంటే, ఉరి వేసుకుంటామని జోగి రమేష్ ప్రకటించారు. నిజం నిరూపించాల్సిన హక్కు ఈ ప్రభుత్వంపై ఉంది అని అన్నారు.