స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోసారి ప్రత్యక్ష పోరాటానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధమైంది. ఈమేరకు బుధవారం షెడ్యూల్‌ను కమిటీ ప్రకటించింది. కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత కూడా విశాఖ ఉక్కును మూసివేసే దిశగా చర్యలు ఆగలేదని... స్టీల్ ప్లాంట్ కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈనెల 22న సీఎండీ కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సెప్టెంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. గంగవరం పోర్ట్‌లో లక్ష టన్నుల రా మెటీరియల్ ఉన్న కేంద్రం దానిని గోడ దాటించే ప్రయత్నం చేయడం లేదన్నారు. దశల వారీగా నిర్వీర్యం చేసి మూసివేయాలని కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తుంటే... విశాఖ ఉక్కు మాత్రం ఉత్పత్తిని తగ్గించి నష్టాలను మూటకట్టుకునేలా యాజమాన్యం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఆర్థిక నష్టాలను కారణంగా చూపించి ప్లాంటును మూసివేయాలన్న ఆలోచనలో భాగంగానే ఈ కుట్రలు జరుగుతున్నాయని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.