విజయవాడ వాసులకు ముఖ్య గమనిక. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఓ ప్రకటనలో తెలియజేశారు. పంద్రాగస్టు వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలుమార్గాల్లో వాహనాల రాకపోకల మీద ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని.. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకలలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ ట్రాఫిక్ మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉదయం ఏడు నుంచి కంట్రోల్ రూమ్ వైపు నుంచి బెంజ్ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలను.. ఆర్.టి.సి. వై జంక్షన్ నుంచి ఏలూరు రోడ్ మీదుగా స్వర్ణ ప్యాలస్, దీప్తి సెంటర్, చుట్టుగుంట, గుణదల, రామవరప్పాడు రింగ్ మీదుగా బెంజ్ సర్కిల్ మీదుగా మళ్లిస్తున్నట్లు విజయవాడ పోలీసులు తెలిపారు. అలాగే బెంజ్ సర్కిల్ వైపు నుంచి బందర్ రోడ్‌లోకి వచ్చే వాహనాలను బెంజ్ సర్కిల్ నుంచి ఫకీర్ గూడెం, స్క్యూ బ్రిడ్జ్, నేతాజీ బ్రిడ్జ్, బస్టాండ్ వైపుకి మళ్ళించినట్లు వివరించారు. ఇక రెడ్ సర్కిల్ నుంచి ఆర్.టి.ఎ. జంక్షన్.. అలాగే శిఖామణి సెంటర్ నుంచి వెటర్నరీ జంక్షన్ వరకూ వాహనాలను అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు. బెంజ్ సర్కిల్ నుంచి డి.సి.పి. బంగ్లా కూడలి వరకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
ఇక ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఆంక్షల పైనా విజయవాడ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆగస్ట్ 15 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆర్.టి.సి “వై” జంక్షను నుంచి బెంజ్ సర్కిల్ వైపునకు ఆర్.టి.సి బస్సులను అనుమతించమని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బందర్ రోడ్డు, రూట్ నంబర్ 5లో వెళ్లే ఆర్టీసీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బెంజ్ సర్కిలు వైపుకు వెళ్లాలని సూచించారు. అలాగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే “AA, A1, A2, B1, B2”పాస్ కలిగిన ఆహ్వానితుల వాహనాల పార్కింగ్ పైనా కీలక సూచనలు చేశారు.
AA పాస్ కలిగిన ఆహ్వానితులు గేట్ నం. 3 (ఫుడ్ కోర్ట్) నుంచి ప్రవేశించి అక్కడే నిర్దేశించిన స్థలములో వాహనాలు పార్కింగ్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే “A1, A2 ” పాస్ కలిగిన ఆహ్వానితులు గేట్ నం. 4 (మీ సేవ) ద్వారా లోపలికి ప్రవేశించి వారి వాహనములను హ్యాండ్ బాల్ గ్రౌండ్లో పార్క్ చేయాలని సూచించారు. “B1, B2 పాస్ ఉన్న ఆహ్వానితులతో పాటుగా పురస్కార గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు గేట్ నం. 2 ద్వారా ప్రవేశించి ఫుట్‌బాల్ గ్రౌండ్ లేదా స్టేడియానికి ఎదురుగా ఉన్ ఆర్మ్‌డ్ రిజర్వు గ్రౌండ్లో వారి వాహనాలను నిలపాలని సూచించారు. స్కూల్ విద్యార్ధులు, ఇతర ఆహ్వానితులు వాటర్ ట్యాంక్ రోడ్డులోని గేటు నెం.6, 7 ద్వారా లోనికి రావాలని పోలీసులు తెలిపారు. ఇక మీడియా సిబ్బంది రెండో గేటు ద్వారా స్టేడియం లోపలికి రావాలని.. అలాగే అక్రిడేషన్ కార్డు, ఫోటో ఐడీ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. పాసులు కలిగిన ఆహ్వానితులు ఉదయం 8 గంటల లోపు స్టేడియం వద్దకు చేరుకోవాలని సూచించారు.