ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం బలోపేతం అవుతుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలని భారత తెలిపారు. వెంకటాచలం మండలం సరస్వతి నగర్‌లోని అక్షర విద్యాలయంలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో శక్తివంతమైన భారత దేశంగా ముందుకెళ్లడం ఎంతో గర్వకారణంగా ఉందని వెంకయ్య నాయుడువెల్లడించారు. స్వరాజ్యం కావాలి పరాయి పాలన పోవాలని చాలా మంది మహానీయుల త్యాగమూర్తుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవమని కొనియాడారు. భారతదేశం గర్వపడేలా మువ్వన్నెల త్రివర్ణ పతాకం రూపకర్త తెలుగు వారు పింగళి వెంకయ్య కావడం చాలా గర్వకారణమని గుర్తుచేసుకున్నారు. దేశంలో 18 శాతం మంది ఇంకా ఆకలితో ఆలమటిస్తున్నారని చెప్పారు. మనం బతుకుతూ మన పక్కవారిని బతికించేలా సమాజం మారాలని వెంకయ్య నాయుడు సూచించారు. ప్రకృతితో మమేకమై జీవించాలని.. రాబోయే తరాలకు ప్రకృతి విలువను తెలియజేసేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. పిల్లలను సెల్‌ఫోన్‌కి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంచి వారి జీవన విధానాన్ని తెలియజేయాలని చెప్పారు. పిల్లలకు చదువుతోపాటు సమాజంలో విలువల, పెద్దలపట్ల గౌరవం, ఆధ్యాత్మికం వైపు వెళ్లేలా చూడాలని వెంకయ్య నాయడు పేర్కొన్నారు.