అన్న క్యాంటీన్లలో ఒక మనిషికి రోజుకు 96 రూపాయిలు ఖర్చు అవుతుందని. ఆహారం తినే వ్యక్తి రూ.15 చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం లేదా దాతలు భరిస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు. అన్న క్యాంటీన్లను పున:ప్రారంభిస్తామని చెప్పగానే ఎంతోమంది దాతలు ముందుకొస్తున్నారని తెలిపారు. అన్న క్యాంటీన్లు మళ్లీ పెడతామంటే శ్రీనివాస్ రాజు అనే వ్యక్తి కోటి రూపాయిల విరాళం ఇచ్చారన్నారు. తన భార్య నారా భువనేశ్వరి సైతం కోటి రూపాయిలు విరాళాన్ని అందజేశారన్నారు. మరింతమంది దాతలు ముందుకొచ్చి అన్న క్యాంటీన్లకు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. ఎవరైనా ఇంట్లో పెళ్లి జరిగితే.. వివాహ ఖర్చు కొంత తగ్గించుకుని అన్న క్యాంటీన్లకు విరాళం అందించాలన్నారు. డిజిటల్ రూపంలోనూ విరాళాలు సేకరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 2019లో టీడీపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి గెలిచి ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో ముందుండేదన్నారు.