ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి.. బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నుంచి స్పెషల్ రిక్వెస్ట్ అందింది. బావ చంద్రబాబు అంటే బాలయ్యకు ఎంత గౌరవమో.. అలాగే బావమరిది బాలకృష్ణ అంటే చంద్రబాబుకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ విషయంలో చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తున్నారు బాలకృష్ణ. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. శుక్రవారం హిందూపురంలో పర్యటించారు. రెండుచోట్ల అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభించిన బాలకృష్ణ.. స్వయంగా తన చేతులతో భోజనం వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ దృష్టికి స్థానికులు ఓ సమస్యను తీసుకువచ్చారు. దీనిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని నందమూరి బాలకృష్ణ హామీ ఇచ్చారు.
అసలు సంగతి ఏమిటంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో వైఎస్ జగన్ జిల్లాల విభజన చేశారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి జిల్లా కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కేంద్రంగా పుట్టపర్తి వద్దని.. హిందూపురాన్ని చేయాలని హిందూపురం వాసులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని గతంలోనూ బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లిన స్థానికులు .. శుక్రవారం మరోసారి గుర్తు చేశారు. దీనిపై బాలయ్య సానుకూలంగా స్పందించారు. జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేసే విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. హిందూపురం అంటే చంద్రబాబుకు ఎంతో అభిమానమన్న బాలకృష్ణ.. అందుకే ఈ ప్రాంతంలో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇక హిందూపురం అభివృద్ధి కోసం త్వరలోనే రూ.90 కోట్లు మంజూరుచేస్తారని ప్రకటించారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని నిధులు తెస్తామని చెప్పారు.
మరోవైపు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు బాలయ్య. స్వాతంత్య్ర దినోత్సవం రోజున బసవతారకం ఆస్పత్రిలో జెండావందనం చేసి అమ్మను స్మరించుకుంటే.. ఇవాళ అన్న క్యాంటీన్లను ప్రారంభించి నాన్న పేరు స్మరించుకున్నానని బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. పేదలకు మూడుపూటల అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతోనే వంద అన్ క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని అందుబాటులోకి తెస్తామన్న నందమూరి బాలకృష్ణ.. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.