ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక కానుక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 10:13 PM

టీటీడీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహించారు. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవీఎస్‌వో సతీష్ పెరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 251 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో ఏడుగురు ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 19 మంది విద్యార్థులకు 2,116/-, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 55 మంది విద్యార్థులకు 1,116/- నగదు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు దేశభక్తి గీతాలకు చ‌క్క‌టి నృత్యం ప్ర‌ద‌ర్శించారు.


  భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని టిటిడి ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించి, తిరుమల యాత్ర భక్తుల మనసులో మధురానుభూతిని మిగిల్చే విధంగా విధులు నిర్వహించాలని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.


స్వాతంత్య్రం కోసం ఎందరో మహానేతలు తమ జీవితాలను అంకితం చేశారన్నారు. మన సనాతన హిందూ ధర్మం, పురాణాలు, వేదాలు మనకు నిస్వార్థ సేవ, త్యాగం, సత్యాన్ని బోధించాయన్నారు. ఆ మార్గంలోనే మన స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రం సాధించారన్నారు. వారి బాటలో పయనిస్తూ, ఉద్యోగులందరూ సమన్వయంతో, అత్యంత అంకితభావంతో భక్తులకు సేవలు అందిస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. తద్వారా యాత్రికులు మరపురాని తిరుమల తీర్థయాత్ర అనుభవంతో వారి ఇళ్లకు తిరిగి వేళతారన్నారు.


రోజుకు దాదాపు 85 వేల మంది భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నామన్నారు. టీటీడీ ఉద్యోగులు నాణ్యమైన అన్నప్రసాదాలు అందించడంతోపాటు, క్యూ లైన్‌లు, ఇతర ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచడంలో 24 గంటలూ ఉత్తమ సేవలందిస్తున్నారన్నారు. రాబోయే రోజులలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించి, ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ఖ్యాతిని పెంపొందించే విధంగా, వివిధ ఆధ్యాత్మిక సంస్థలకు ఆదర్శప్రాయంగా నిలిచేందుకు బాధ్యతలు నిర్వహించాలన్నారు. టీటీడీకి, భక్తులకు విశేష సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు, టీటీడీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేస్తున్న మీడియా ప్రతినిధులకు జేఈవో వెంకయ్య చౌదరి అభినందనలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com