రాఖీ పండుగ అంటే అన్నలకు చెల్లెల్లు.. తమ్ముళ్లకు అక్కలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే బీహార్ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత నితీష్ కుమార్.. రక్షా బంధన్ రోజున చెట్టుకు రాఖీ కట్టి వినూత్నంగా పండగను జరుపుకున్నారు. అయితే చెట్టుకు రాఖీ కట్టడం వెనుక బీహార్‌లో పెద్ద చరిత్రే ఉంది. పర్యావరణ పరిరక్షణపై బీహార్ ప్రజల్లో అవగాహన కల్పించడానికి.. అక్కడి ప్రభుత్వం ఎన్నో ఏళ్ల క్రితమే ఈ సంప్రదాయాన్ని తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా నితీష్ కుమార్.. చెట్టుకు రాఖీ కట్టి ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు.
రాఖీ పండగ రోజున రాజధాని పాట్నాలోని వాటిక ఉద్యానవనంలో బాంబాక్స్ ఇంపలాటికా చెట్టుకు రాఖీని కట్టారు. అదే సమయంలో దొరండా అనే మొక్కను నాటారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడం.. మొక్కలను సంరక్షించడం.. మరిన్ని చెట్లను నాటడమే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. పర్యావరణాన్ని కాపాడటానికి బీహార్ ప్రభుత్వం 2012 నుంచి రక్షా బంధన్ పండగను బీహార్ వృక్ష సురక్షా దివస్‌గా పాటిస్తోందని చెప్పారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌధరి, విజయ్ కుమార్ శర్మతో కలిసి నితీష్ కుమార్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని.. నాటిన మొక్కలను కాపాడాలని.. జల్ జీవన్ హరియాలి మిషన్ కింద మొక్కలు నాటడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని బీహార్ సీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది. బీహార్‌లో ఎకో టూరిజంను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడించింది. మంత్రులు, అధికారులు కూడా ఈ సందర్భంగా మొక్కలు నాటారు.
ప్రజల మధ్య సోదరభావాన్ని ప్రతిబింబించే రాఖీ పండుగ రోజున అన్నదమ్ములకు, ఇతర కుటుంబ సభ్యులకే కాదు.. పచ్చని ప్రకృతికీ రాఖీ కట్టే సంప్రదాయం ఒడిషాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే ఈ పచ్చని చెట్టును సురక్షితంగా ఉంచుకోవడం మన కనీస ధర్మమని అక్కడి వారు విశ్వసిస్తారు.
ఈ ఆలోచనతోనే అక్కడి ప్రజలు రాఖీ పౌర్ణమి రోజున దగ్గర్లోని అడవి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడి.. చెట్లు, మహావృక్షాల కొమ్మలు, కాండాలకు రాఖీలు కడుతూ ఉంటారు. దీన్ని జంగిల్ రక్షా బంధన్ అని ఒడిషా వాసులు పిలుచుకుంటారు. ఈ ఆచారం 2004 నుంచే ప్రారంభమైందని.. పర్యావరణ పరిరక్షణను తాము పాటించడంతో పాటు దీని ప్రాముఖ్యాన్ని ఇతర రాష్ట్రాలు, దేశాలకూ చాటిచెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ పండగను ఏటా జరుపుకుంటున్నట్లు అక్కడి ప్రజలు చెబుతారు.