ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల కోసం భారీగా నిధులు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల కోసం ఏకంగా రూ.1452 కోట్లు విడుదల చేశారు. గ్రామపరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు, పట్టణ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.454 కోట్లు చొప్పున ఆర్థిక శాఖ విడుదల చేసింది. గత వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థలకు నిధుల విడుదల సందర్భంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైనట్లు తెలిపారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు స్థానిక సంస్థలకు విడుదల చేసిన నిధుల ద్వారా గ్రామ, వార్డు స్థాయిలో పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ఈ మేరకు నిధులు విడుదలైన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ నిధుల ద్వారా స్థానిక సంస్థలకు ఆర్థికంగా వెసలుబాటు కలుగుతుందన్నారు పయ్యావుల కేశవ్. అలాగే గ్రామాల అభివృద్ధితోనే ప్రగతి సాధ్యమన్న బాపూజీ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తామని మంత్రి చెప్పారు.
మరోవైపు టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా పట్టణ ప్రణాళిక విభాగాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖతో అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలను అడ్డుకునే విషయమై అధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. పురపాలక, పట్టణ ప్రణాళిక, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో నారాయణ చర్చించారు. బాండ్ల జారీలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖతో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని అనుసంధానం చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారు చేయాలని సూచించారు. ఇక ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్లు, ఓనర్‌షిప్ డాక్యుమెంట్లు, సర్వే నంబర్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు.