వైసీపీ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిగ్గు తేలుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సోమవారం ఆయన ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విడగొట్టి ఒక్కో జోన్‌కు ఒక్కో అధికారిని పెట్టి మరీ అక్రమ వసూళ్లు చేశారు. ఇసుక, మైనింగ్, రేషన్ బియ్యం, అక్రమ మద్యం... ఇలా దేనినీ వదలకుండా ప్రతి అక్రమ రవాణాకు సహకరించి దానికి బదులుగా భారీగా వసూళ్లు చేశారు. ఈ దందాకు ఒక ఉన్నతాధికారి పూర్తి అండదండలు ఇచ్చాడు. కీలక పాత్ర పోషించాడు. ఆయన పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ దుర్మార్గాలపై విచారణ వేస్తున్నాం. అందులో అందరి పాత్రలు బయటకు వస్తాయి. ఎవరినీ వదిలిపెట్టేది లేదు’ అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అనేక దుర్మార్గాలకు పాల్పడిన అధికారులు, వారి కింద తాబేదారులు తమ తప్పులు బయటకు రాకుండా చూడటానికి కార్యాలయాల్లో ఫైళ్లు తగలబెట్టడాన్ని ఒక మార్గంగా ఎంచుకొన్నారని ఆయన ఆరోపించారు. అందుకే గత కొద్ది రోజుల్లో ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయని తెలిపారు. ‘గత ఐదేళ్ల అక్రమాలను వెలికితీస్తామని మేం చెప్పిన తర్వాత భయంతో రికార్డులు తగలబెడుతున్నారు.