దేశంలోనే అతి పెద్ద చేనేత పరిశ్రమగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా నేతన్నలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చేనేతలు ఇప్పుడు పూట కూలీ కూడా తెచ్చుకోలేక పోతున్నారు. దారానికి రంగులద్ది కళ్లకు ఇంపైన రంగుల వస్త్రాన్ని నేసిన కళాకారుల కళ్లు నేడు చెమ్మగిళ్లుతున్నాయి. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో బతుకు భారమై వృత్తికి దూరమవుతున్నారు. అపురూపమైన కళను వదిలి వ్యవసాయ కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా బతుకు వెళ్లదీస్తున్నారు. ముడిసరుకు సబ్సిడీపై ఇచ్చి పని కల్పించాలని, నేసిన వస్త్రాన్ని ప్రభుత్వ అవసరాలకు కొనుగోలు చేయాలని వేడుకొంటున్నారు.