ఏపీలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత వేటు నిబంధనను తొలగించినట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై కేబినెట్‌లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్టు సీఎం తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపై సమీక్షలో చర్చించారు. దీనిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
ఈ నెల 23 తేదీన 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు. గ్రామ పంచాయతీలకు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్టు సీఎంకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వివరించారు.