చంద్రబాబు ప్రభుత్వం…. శాడిస్ట్ ప్రభుత్వంలా వ్యవహరిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వోద్యోగులకు వేధింపులు, అవమానాలపై శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశంలోనూ కక్ష సాధింపు ధోరణి కనిపిస్తోందన్నారు, చంద్రబాబు సర్కార్ శాడిస్ట్ సర్కార్‌గా మారిందని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..... రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నట్టు కనిపించడంలేదు. ప్రతి అంశంలోనూ కక్ష సాధింపు కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం శాడిస్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోంది. తనకున్న మీడియా బలాన్ని వాడుకుని ఎదుటి పార్టీలను, ఆపార్టీల్లోని వ్యక్తుల వ్యక్తిత్వాలను హననం చేయడం, తాను చేస్తున్న ప్రచారాలకు బలం చేకూర్చేలా, అది ప్రజలు నిజమని నమ్మేలా ఉండేందుకు ఉన్నతాధికారుల సహా, ఉద్యోగుల్లో ఎలాంటి వారినైనా చంద్రబాబు బలి చేస్తున్నాడు. నెల్లూరు పర్యటన సందర్బంగా ఐ అండ్ పీఆర్ ఉద్యోగిపై చంద్రబాబు శివాలెత్తారు. శ్వేతపత్రం ఇస్తున్న సందర్భంలో కూడా చంద్రబాబు ఇలాగే నోటికొచ్చినట్టు మాట్లాడారు.ఒళ్లు దగ్గర పెట్టుకోండి అంటూ చిర్రుబుర్రులాడారు. ఇంకా తమాషాలు చేస్తున్నారంటూ.. తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.అసలు ఉద్యోగులు అంటే.. చంద్రబాబుకు చాలా చిరాకు. గవర్నమెంటు ఉద్యోగులంటే మరీనూ. సరిగ్గా 2019కు ముందు ఉద్యోగులనుద్దేశించి ఆంధ్రజ్యోతి రాధాకష్ణ చంద్రబాబు మధ్య జరిగిన వీడియో సంభాషణ ఎన్ని తరాలైనా మరిచిపోం.ఈ ఎన్నికలకు ముందు ఉద్యోగుల మీద వాజ్యమైన ప్రేమ ఉన్నట్టుగా చంద్రబాబు నటించారు. వారిలో సగం తానే అన్నట్టుగా మాట్లాడారు. పాపం ఉద్యోగులు.. ఎప్పటి లానే.. నేరేడు చెట్టుకోతిమొసలి కథలో కోతి మొసలిని నమ్మినట్టుగా, బంగారు కడియంపులి కథలో పాపం బాటసారి పులిని నమ్మినట్టుగా నమ్మారు. మాకు మించి చంద్రబాబు ఏదో చేస్తాడనే నమ్మకంతో, విశ్వాసంతో చంద్రబాబు వైపు ఎక్కువ శాతంమంది ఉద్యోగులు మొగ్గుచూపారు. మా ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను ప్రభుత్వంలో ఒక భాగంగా చూశాం. కోవిడ్ సంక్షోభం, తద్వారా ఆర్థిక వ్యవస్థలు అతాకుతలం కావడంతో ప్రపంచంలోని బాగా డబ్బున్న దేశాలు కూడా కుదేలైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగులను కంటికిరెప్పలా కాపాడుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఉంటే ఏం జరిగేదో.. తెలియంది కాదు.ఉద్యోగులను ఆత్మీయంగా చూసుకున్నాం. కాబట్టే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగాం. 30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వడం దగ్గర నుంచి, ప్రతి పథకం అమల్లో కూడా ఉద్యోగుల చక్కగా సహకరించారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మళ్లీ తన నిజ స్వరూపం చూపిస్తున్నారు. ఉద్యోగుల్ని వేధించి, వేధించి.. వెంటాడుతున్నాడు. చంద్రబాబు ఉద్యోగులపై హూంకరింపులు, చిరాకులు, పరాకులు, బెదిరింపులు.. వీటన్నింటి వెనుకా.. ఒక గేమ్ ఉంది. తనకు తానుగా కత్రిమ ఇమేజీని తెచ్చుకోవడానికి తన మీడియా సంస్థలతోకలిసి చంద్రబాబు ఆడుతున్న పబ్లిసిటీ డ్రామా ఇదంతా. ఈ గేమ్ వెనుక అసలు ఉద్దేశం అదే. తాను ఇచ్చిన వాగ్దానాల్ని చంద్రబాబు నెరవేర్చలేడు, మేనిఫెస్టోలో హామీలను ఎలాగూ గాలికి వదిలేస్తాడు, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టే అవకాశమే కనిపించడం లేదు. రాజకీయంగా కాపాడుకోవడానికి చేస్తున్న ప్రచార ఎత్తుగడలే ఇవన్నీ కూడా. దీంతోపాటు ఈమధ్య చంద్రబాబు తరచుగా ఇస్తున్న స్టేట్‌మెంట్ ఏంటంటే తనలో 95 నాటి సీఎంను చూస్తారంటున్నాడు. ఆరోజుల్లో చంద్రబాబు తన మా ఎన్టీఆర్‌ను వెన్నుపోటుపొడిచి కుర్చీలాక్కున్నాడు. ఆకస్మిక తనిఖీలు, అధికారులకు బెదిరింపులు, అందరిముందూ వారిని అవమాన పరచడం.. ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. వాస్తవం ఏంటంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కానీ.. అభివద్ధిపరంగా, సంక్షేమం పరంగా.. అన్ని రకాలుగానూ చంద్రబాబు అధికారంలో లేని కాలమే చాలా బాగుందని అనేక గణాంకాలు, అనేక రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి అని అన్నారు.