ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పనితీరుపై మండిపడ్డారు. టీడీపీలో ఎవరిస్థాయిలో వాళ్లే రెడ్‌బుక్ పేరిట విధ్వంసాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం, వైసీపీ లీగల్ సెల్ విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్తే ఎదురు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో పత్రాలు కాలిపోతే వైసీపీ శ్రేణులే కారణమంటూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనలకు టీడీపీ నాయకులే చేసి ఆ నెపాన్ని వైసీపీపై రుద్దుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో పోటీ చేసిన పెద్దారెడ్డిని అడుగుపెట్టనీయకుండా టీడీపీ మూకలు దాడులు చేశారని, మురళి అనే కార్యకర్త మీద దాడులు చేసి, ఇంటిని తగలబెట్టారని వివరించారు.రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని, బాధితులకు అండగా నిలబడాలని సూచించారు. వైసీపీ పాలనలో న్యాయవాదుల సంక్షేమానికి వంద కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. కొత్తగా వృత్తిలోకి వచ్చే న్యాయవాదులకు మూడు సంవత్సరాల పాటు ప్రతి ఆరు నెలలకొకసారి రూ. 30వేల చొప్పున అందించిన ఘనత వైసీపీదేనని పేర్కొన్నారు.