ఏపీలోని సుమారు 13వేలకు పైగా పంచాయతీలలో ఇవాళ (ఆగస్ట్ 23వ తేదీన) గ్రామసభలు జరిగాయి. ఒకేరోజు ఈ స్థాయిలో గ్రామసభల నిర్వహణ దేశంలోనే ఇదే తొలిసారి. ఇక ఈ సంబరంలో పాల్గొనేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అన్నమయ్య జిల్లాకు వెళ్లారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కారుమంచి సంయుక్త మీద పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆమె విజయం తనను కదిలించిందంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఎవరీ కారుమంచి సంయుక్త అనే విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
2021లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓ రకమైన వాతావరణంలో అప్పట్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దాడులు, హింసాత్మక ఘటనలు అనేకం అప్పట్లో చోటు చేసుకున్నాయి. చాలాచోట్ల పోటీకి సైతం ముందుకు రాని పరిస్థితి. దీంతో ఎక్కువ స్థానాల్లో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో జనసేన తరుఫున కారుమంచి సంయుక్త పోటీ చేశారు. పోటీ చేయడమే కాదు ఒత్తిళ్లకు తలొగ్గకుండా బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అప్పట్లో ఎన్నికల సమయంలో రోడ్డుమీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదన్న పవన్.. అలాంటి పరిస్థితుల్లోనూ నిలబడి సంయుక్త విజయం సాధించారని కొనియాడారు.
మరోవైపు సంయుక్త భర్త మిలిటరీలో పనిచేసేవారు. దురదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే సైన్యంలో పనిచేస్తూ భర్త చనిపోయినా కూడా.. ఆయన ఆశయాలను సాధించేందుకు కారుమంచి సంయుక్త పంచాయతీ ఎన్నికల్లో పోటీచేశారు. ఒత్తిళ్లు, బెదిరింపులను సైతం లెక్కచేయక బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ విషయం నిజంగా తన గుండెను కదిలించిందన్న డిప్యూటీ సీఎం.. సంయుక్త పట్టుదలతో ఇలాంటి మహిళలు రాజకీయాల్లో ఉండాలని.. రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
మరోవైపు ఇదే కార్యక్రమంలో తనకు సినిమాలు ఎక్కువ కావంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాల కంటే దేశం ముఖ్యమని.. దేశం బాగున్నప్పుడే సినిమాలు చూసేందుకు అవుతుందంటూ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అలాగే సీఎం చంద్రబాబు నుంచి నేర్చుకోవాలనే తపన తనకు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.