అనకాపల్లి జిల్లాలో మరో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.. క్షతగాత్రులను వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.. క్షతగాత్రులను జార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు.
ఈ ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంపై సీఎం అధికారులతో మాట్లాడారు.. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే అక్కడికి వెళ్లాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికుల్ని విశాఖపట్నం ఇండస్ ఆస్పత్రిలో ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.. ఆ వెంటనే ఈ ప్రమాదం జరగడం కలకలంరేపింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా చలంవలసకు చెందిన పార్థసారథి అచ్యుతాపురం ఘటనలో ప్రాణాలు కోల్పోయగా.. ఆ కుటుంబాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి పరిహారం చెక్కును మృతుడి కుటుంబసభ్యులకు అందజేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో బాధిత కుటుంబానికి పరిహారం అందించారని.. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అచ్యుతాపురం ఎసెన్షియా కర్మాగారంలో జరిగిన ప్రమాదమే రాష్ట్రంలో చివరిది కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్మాగారాల్లో ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకువచ్చేలా శాశ్వత స్థాయిలో పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకుంటామని.. ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని.. కాకపోతే ఆ కంపెనీల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన భద్రతా చర్యలు చేపట్టాలి అన్నారు. ఈ ప్రమాదంపై హైలెవల్ కమిటీని ఏర్పాటుచేస్తామని.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు.
అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 17మంది కుటుంబీకులకు ఎసెన్షియా కంపెనీ ఇవ్వనున్న పరిహారానికి సంబంధించి.. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాతే రూ.కోటి చొప్పున నష్టపరిహారాన్ని పంపిణీ చేస్తారు. 24 గంటల్లోగా ఈ చెక్కుల్ని బాధిత కుటుంబాలకు అందజేస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే రూ.50 లక్షలు, స్వల్ప గాయాలకు రూ.25 లక్షలు ఇస్తామని ప్రకటించారు. చంద్రబాబు ఈ ప్రమాదంలో గాయపడినవారిని పరాామర్శించారు.. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. వైద్యం విషయంలో రాజీపడొద్దని సూచించారు.