ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్.. ఉద్యోగులకు లాభమేనా

national |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 03:17 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. అయితే ఇందులో అతి ముఖ్యమైనది ఉద్యోగుల పెన్షన్‌లకు సంబంధించిన కొత్త విధానం. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పెన్షన్ పథకంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. 2004 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అంతేకాకుండా 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వస్తుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ క్రమంలోనే అసలు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో ఏ ఏ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి. ఎంత పెన్షన్ వస్తుంది అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.


దేశంలోని ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌- యూపీఎస్‌ పేరుతో కొత్త పింఛన్‌ పథకాన్ని శనివారం ప్రకటించింది. 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త పింఛన్‌ పథకం వర్తిస్తుంది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్‌ పే సగటులో 50 శాతం కచ్చితంగా పింఛన్‌ రూపంలో అందుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇక ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను మరింత వివరంగా ఇక్కడ చూద్దాం.


కచ్చితమైన పెన్షన్‌


కనీసం 25 ఏళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులు కచ్చితమైన పెన్షన్‌కు అర్హులు అవుతారని కేంద్రం వెల్లడించింది. ఇలాంటి ఉద్యోగులు పదవీ విరమణ చేయడానికి ముందు 12 నెలల పాటు అందుకున్న బేసిక్‌ పే సగటులో 50 శాతం జీతాన్ని ప్రతి నెల పెన్షన్ రూపంలో కచ్చితంగా అందుకుంటారని తెలిపింది. కనీసం 10 ఏళ్ల పైన.. 25 ఏళ్ల లోపు ఉన్న ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన వారికి వారి సర్వీసుకు తగ్గట్టుగా పెన్షన్ ఉంటుందని పేర్కొంది.


కచ్చితమైన కుటుంబ పెన్షన్‌


ఏదైనా అనుకోని ప్రమాదంలో ఒకవేళ ఉద్యోగి మరణించినట్లయితే వారి భాగస్వాములకు పెన్షన్ అందుతుంది. ఆ ఉద్యోగి చనిపోయే నాటికి అందుకుంటున్న జీతంలో 60 శాతం కచ్చితమైన సొమ్మును ఉద్యోగి కుటుంబానికి పెన్షన్‌గా అందిస్తారు.


కచ్చితమైన కనీస పెన్షన్


కనీసం 10 ఏళ్ల పాటు సర్వీసులో ఉండి రిటైర్‌ అయిన ఉద్యోగులకు కనిష్టంగా రూ.10 వేలు కచ్చితంగా పెన్షన్ అందుతుంది.


ద్రవ్యోల్బణ ఇండెక్సేషన్‌


కచ్చితమైన పెన్షన్, కచ్చితమైన కుటుంబ పెన్షన్, కచ్చితమైన కనీస పెన్షన్‌పై ఇండెక్సేషన్‌ ప్రయోజనం ఉంటుంది. ఇది డియర్‌నెస్‌ రిలీఫ్‌ ఆల్‌ ఇండియా కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ వర్కర్స్‌(ఏఐసీసీఐ-ఐడబ్ల్యూ)పై ఆధారపడి ఉంటుంది.


పదవీ విరమణ వేళ


ఈ యూపీఎస్‌ విధానంలో గ్రాట్యూటీకి అదనంగా పదవీవిరమణ సమయంలో ఉద్యోగులకు కొంత మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతి 6 నెలల సర్వీసు పూర్తిపై నెల వేతనం(పే + డీఏ)లో 10వ వంతును లెక్కగట్టి దీన్ని ఇస్తుంది. ఈ చెల్లింపు కచ్చితమైన పింఛన్‌ మొత్తాన్ని తగ్గించదని కేంద్రం స్పష్టం చేసింది.


యూపీఎస్, ఎన్‌పీఎస్‌ ఎంపిక ఉద్యోగుల ఇష్టమే


ఇప్పటివరకు అమలు అవుతున్న న్యూ పెన్షన్ స్కీమ్‌లో ఉండాలా లేక కొత్తగా వచ్చిన యూనిఫైడ్ పెన్షన్‌ స్కీ్మ్‌లో చేరాలా అనేది ప్రభుత్వ ఉద్యోగులే నిర్ణయించుకోవచ్చని.. దాన్ని వారికే వదిలేసినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. 2004లో ఎన్‌పీఎస్‌ను అమలులోకి తీసుకొచ్చినప్పటి నుంచి.. యూపీఎస్‌ అమలులోకి వచ్చే ఒక రోజు ముందు వరకు అంటే 2025 మార్చి 31 వరకు పదవీ విరమణ పొందిన వారికి.. పొందబోయే వారికి కూడా వర్తిస్తుందని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ తెలిపారు. ఇందుకుగానూ వారు అందుకున్న పెన్షన్‌, యూపీఎస్‌ ప్రకారం అందాల్సిన పెన్షన్‌ను సర్దుబాటు చేసి బకాయి ఉంటే ప్రభుత్వం చెల్లించనున్నట్టు చెప్పారు.


ఎన్‌పీఎస్‌కు, యూపీఎస్‌కు తేడా ఏంటి?


కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ అమలు చేస్తోంది. దీంట్లో ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కచ్చితంగా ఇంత మొత్తం పెన్షన్ అందుతుందనే గ్యారెంటీ లేదు. ఉద్యోగి తన సర్వీసులో పెన్షన్ కోసం అందించిన కంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టి.. దానిపై వచ్చే లాభాలపై వారి పెన్షన్లు ఆధారపడి ఉంటాయి. అయితే కొత్తగా తీసుకువచ్చిన యూపీఎస్‌ విధానంలో మాత్రం కచ్చితంగా ఇంత పెన్షన్ అందుతుందనే హామీ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com