దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన కోల్‌కతా హత్యాచార ఘటనలో సీబీఐ అధికారులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు సంజయ్ రాయ్ సహా ఆర్‌జీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పైనా విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సందీప్ ఘోష్ ఆస్తులపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఆదివారం ఒక్కరోజే మొత్తం 15 చోట్ల సీబీఐ అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టారు. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఘటన సమయంలో కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉండి.. ఆ తర్వాత రాజీనామా చేసి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై సీబీఐ దాడులకు దిగింది. ఈ క్రమంలోనే ఆయన ఆస్తులపై ఆదివారం దాడులు నిర్వహించింది. ఏక కాలంలో సందీప్ ఘోష్‌కు సంబంధించిన ఆస్తులు, ఇళ్లు, కార్యాలయాలపై తనిఖీలు చేపట్టింది. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు సందీప్ ఘోష్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది.
ఆగస్టు 9వ తేదీన కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ పీజీ డాక్టర్ హత్యాచారానికి గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కోల్‌కతా పోలీసుల దర్యాప్తు తీరు దారుణంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తడంతో ఆ కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్జీ కర్ ఆస్పత్రిలో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ.. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై మరిన్ని కేసులు నమోదు కాగా.. వాటిని కూడా న్యాయస్థానం సీబీఐకి బదిలీ చేసింది. 3 వారాల్లోగా దర్యాప్తుకు సంబంధించి స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సందీప్ ఘోష్ సహా మరో నలుగురికి శనివారం లై డిటెక్టర్ పరీక్షలు చేశారు. దీనికోసం ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ నుంచి స్పెషల్ టీమ్స్ కోల్‌కతా చేరుకున్నాయి.
ఈ క్రమంలోనే కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మెడికల్ కాలేజీలో ఉన్న అనాథ శవాలను సందీప్ ఘోష్ అమ్ముకునేవాడని.. సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆస్పత్రిలో వాడి పడేసిన సిరంజిలను, ఇతర సామగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి వాటి ద్వారా సందీప్ ఘోష్ సొమ్ము చేసుకొనేవాడని తెలిసింది. గతేడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి.. ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సుపరింటెండెంట్‌గా ఉన్న అక్తర్ అలీ.. ఈ కేసు విచారణలో ఈ విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ కేసులో మొదట సిట్ విచారణ జరపగా.. ఈ ఆరోపణలు చేసిన అక్తర్ అలీని విచారణకు పిలిచింది. ఆయన చేసిన ఫిర్యాదుల ఆధారంగా సందీప్ ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 2023 జులై 14వ తేదీన అక్తర్ అలీ రాసిన లేఖ ప్రకారం.. ఆస్పత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్త్ భవన్ అనుమతులు లేకుండానే సందీప్ ఘోష్ లీజుకు ఇచ్చేవాడని పేర్కొన్నాడు. ఇక హాస్పిటల్‌లకు అవసరమైన మెషీన్లు, మెడిసిన్ సరఫరా చేసేవారిని ఎంపిక చేసే క్రమంలో తన బంధువులను తెచ్చిపెట్టినట్లు ఆరోపించాడు. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చాడని తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. ఇక సరఫరాదారుల నుంచి 20 శాతం కమిషన్ తీసుకునేవాడని.. దీంతోపాటు పరీక్షల్లో ఫెయిల్ అయిన మెడికల్ విద్యార్థుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసేవాడని సందీప్ ఘోష్‌పై ఆరోపణలు ఉన్నాయి.