ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు గుడ్‌న్యూస్ రానుంది. కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్లతో 12 పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేయనుంది. ఈ పార్కులు ఏర్పాటు కానున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఈ భారీ ప్యాకేజీని కేంద్ర కేబినెట్ త్వరలోనే త్వరలో ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఇతర ప్రాంతాల్లో కొత్తగా ఈ పారిశ్రామిక పార్కులను కేంద్రం ఏర్పాటు చేయబోతోంది. కేబినెట్ తీసుకోనున్న ఈ నిర్ణయంతో రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక పురోగతిని గణనీయంగా పెంచుతుందని కేంద్రం యోచిస్తోంది. ఈ వారంలోనే కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉందని సమాచారం. సుమారు రూ.25,000 కోట్ల ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ఈ కొత్త ప్రాజెక్టులు రూ.1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించగలవని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా గృహ, వాణిజ్య ప్రాంతాలతో కూడిన సగటు పారిశ్రామిక నగరాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలవని విశ్వసిస్తోంది. ఈ పారిశ్రామిక పార్కుల ద్వారా దేశీయంగా తయారీని పెంచడం, ఉపాధిని సృష్టించడం సాధ్యమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.