ఈ క్రాప్ లో తప్పనిసరిగా పత్తి రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఈ క్రాఫ్‌లో నమోదు చేసిన పంటను కొనుగోలు చేయాలని సీసీఐ ప్రతినిధులకు మంత్రి స్పష్టంచేశారు. అదే సమయంలో ఈ క్రాప్ లో నమోదు వల్ల ప్రభుత్వం అందించే ఫలాలతో లబ్ది పొందొచ్చుననే విషయంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అంతిమంగా రైతులకు మేలు చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే పత్తిని కొనుగోలు చేయబోమని రైతులకు తేల్చి చెప్పాలన్నారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. అంతిమంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జ్యూట్ సంచులు, కాటన్ సంచులు వినియోగంలోకి తీసుకురావాలని, రైతులను చైతన్యం చేసేందుకు అధికారులు, జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యాలు, సీసీఐ ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రైతుల దగ్గర పంట కొనుగోలు చేస్తే జన్నింగ్, స్పిన్నింగ్ మిల్లర్లకు సెస్ మినహాయింపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.