రాష్ట్రంలో సాక్ష్యం జన్‌మన్ పథకంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి రూ.70 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆమె ఢిల్లీలో గురువారం కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి అన్నపూర్ణాదేవిని కలిసి రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం పలు వినతులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. సాక్ష్యం పథకంలో ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులకు మ్యాచింగ్‌గా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు. అదే విధంగా గిరిజన ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి కేంద్రం మరో రూ.20 కోట్లు కేటాయించిందన్నారు. డబుల్ పోర్టల్‌లో ఫేషియల్ రికగ్నేషన్ ప్రోగ్రామ్‌ను ఒకే పోర్టల్ ద్వారా చేస్తే ఉద్యోగులకు పనిభారం తగ్గుతుందని సూచించామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న బాలామృతం ఇక్కడే తయారీకి ప్రతిపాదించామన్నారు. ఏపీ విభజన తదుపరి బాలామృతం తయారీ కేంద్రం తెలంగాణలో ఉండిపోయిందన్నారు. ఈ బాలామృతం దిగుమతికి తెలంగాణకు ప్రతి ఏటా రూ.240 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి మన రాష్ట్రంలోనే ఈ బాలామృతం తయారీకి యోచిస్తున్నామన్నారు. ఏపీ ఫుడ్స్ ఫ్యాక్టరీ పెట్టి తయారీకి ప్రతిపాదించామన్నారు. ఇందుకు రూ. 80 కోట్లు అవసరమని ప్రతిపాదిస్తే కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆమె వెంట మహిళా,శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సూర్యకుమారి ఉన్నారు.