కడప నగర రైల్వేస్టేషన సమీపంలో వెలసిన వేలంగణి ఆరోగ్యమాత ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కర్నూలు మేత్రాసన పీఠాధిపతులు బిషప్ గోరంట్ల జ్వనేష్ హాజరై పతాకావిష్కరణ గావించి మాట్లాడారు. మరియతల్లి అనుగ్రహ పరిపూర్ణురాలని, తరతరాల విశ్వాసులంతా ఆమెను ధన్యురాలని కొనియాడబడుతున్నారని అన్నారు. కడపలో కొలువైన ఆరోగ్యమాత సన్నిధిలో చేరి ప్రార్థించిన వారికి ఆ తల్లి దీవెనలు, అనుగ్రహాలు మెండుగా వుంటాయని అన్నారు. ఉత్సవాల మొదటి రోజున మరియతల్లి తేరును ప్రత్యేకంగా అలంకరించి చర్చి ప్రాంగణంలో వుంచారు. విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ఆతల్లి వద్ద ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో ఆ పుణ్యక్షేత్ర ఫాదర్‌లు, విశ్వాసులు, తిరుణాల కమిటీ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.