తిరుమల శ్రీవారికి మరో భక్తుడు కానుకల్ని అందజేశారు. తమిళనాడు రాజధాని చెన్నైకు చెందిన వేణు సుదర్శన్ టీవీఎస్ మోటార్స్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన మొత్తం 16 బైక్ (15 ఎలక్ట్రిక్ బైక్)లను టీటీడికి అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఈ బైక్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆ తర్వాత దాత బైకుల తాళాలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ డీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ 16 బైక్‌ల విలువ రూ.22 లక్షలని దాత వేణు సుదర్శన్ తెలిపారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట వరకు క్యూ లైన్‌లు దర్శనమిస్తున్నాయి. సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతోంది.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 62,529మంది భక్తులు దర్శించుకున్నారు. 29,730 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీకి రూ.4.51 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది.
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి మొదలుకానున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే మురళీమోహన్, కలెక్టరు సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠలు సమీక్ష చేశారు. సెప్టెంబరు 7 నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాల్లో ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతుందని.. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 450 మంది సిబ్బందితో భద్రత కల్పించనున్నట్లు ఎస్పీ తెలిపారు. అవసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతి, చిత్తూరు నుంచి కాణిపాకం వచ్చే మార్గాలలో అవసరమైన మరమ్మత్తులు చేయడంతో పాటుగా కాణిపాకంలో రథం తిరిగే దారిని రిపేరు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నలుమూల నుంచి విచ్చేసే భక్తుల కోసం అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. కాణిపాకంలో 21 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడు స్వామి దర్శనం సమయంలో ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఆలయానికి చెందిన 14 గ్రామాల ఉభయదారులు తమ సహకారాన్ని అందించాలన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు భక్తుల గుండెల్లో పదికాలల పాటు నిలిచి పోయేలా నిర్వహించాలి అన్నారు.