ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు విద్యాశాఖ సెలవు ప్రకటించిందిఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కలెక్టర్ సృజన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం-కేశ్యాతండా మధ్య వాగులో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీలోని మొత్తం 70 గేట్లు ఎత్తి 3,32,374 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, యర్రగొండపాలెంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల-వినగడప మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో సమీపంలోని 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.నందిగామ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నల్లవాగు ,వైరా , కట్టలేరు పొంగి ప్రవహిస్తున్నాయి. అడిరావులపాడు గ్రామం వద్ద నల్లవాగు పొంగి రామన్నపేట-నందిగామ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దాములూరు- వీరులపాడు మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.విజయవాడలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని ప్రధాన రహదారులు జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మచిలీపట్నంలో కూడా భారీ వర్షం పడుతోంది. దీంతో రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.