కండోమ్‌లు కొనుగోలు చేస్తున్న వారి వ్యక్తిగత సమాచారం లీక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. యూకేకి చెందిన కండోమ్ కంపెనీ స్థానిక విభాగం డ్యూరెక్స్ ఇండియా నుంచి తన కస్టమర్ల ప్రైవేట్ సమాచారం లీక్ అయిందని ఓ సెక్యూరిటీ రిసర్చర్ తెలిపారు. డ్యూరెక్స్ భారతీయ విభాగం కీలక సమాచారం లీక్ అయిందని వివరించారు. దీంతో వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన డేటా చోరీకి గురైనట్లు తేలింది. సెక్యూరిటీ రీసెర్చర్ సౌరజీత్ మజుందార్ ఈ విషయాన్ని టెక్ క్రంచ్‌కు చెప్పారు. డేటా లీక్‌తో కస్టమర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. డ్యూరెక్స్ ఇండియా వెబ్‌సైట్ ఆర్డర్ కన్ఫర్మేషన్ పేజీలో సరైన అథంటికేషన్ లోపించిందని, దీని వలన గుర్తు తెలియని వ్యక్తులు వెబ్ సైట్లోకి చొరబడి కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని వెల్లడించారు. కస్టమర్ పేర్లు, మొబైల్ నంబర్‌లు, ఈ - మెయిల్, షిప్పింగ్ అడ్రస్, ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్, ఎంత మొత్తం చెల్లించారో తదితర వివరాలు ఉన్నాయి. ఎంత మంది డేటా లీక్య అయిందో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఈ సంఖ్య వందల నుంచి వేల వరకు ఉండవచ్చని సౌరజీత్ అంటున్నారు. డేటా ప్రస్తుతం అందుబాటులో ఉందని.. మరో సారి ఇలాంటి దాడే జరిగే అవకాశం ఉందని చెప్పారు.