రాజస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కావాలంటే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉండరాదని 2001లో నిబంధనలు పెట్టింది. దీన్ని 2017లో పదవీ విరమణ చేసి, 2018లో రాజస్థాన్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ సైనికుడు రామ్ లాల్ జాట్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాజస్తాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. 2001లో చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ప్రకారం పిటిషనర్ రామ్ లాల్ 2018లో దరఖాస్తు చేసుకున్న పోలీసు ఉద్యోగానికి అనర్హతకు గురయ్యాడు. ఇదే అంశంపై 2022లో రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2002 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు కలిగి ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తూ రూపొందించిన నిబంధనల ప్రకారం ఈయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడయ్యాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరు పిల్లల విధానాన్ని కలిగి రాష్ట్రాల్లో రాజస్థాన్‌తో పాటు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, అసోం, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటకలూ ఉన్నాయి.