ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం అతలాకుతలం అవుతోంది. రెండు రోజులుగా ముసురు వానలు కురుస్తుండగా.. శనివారం ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం వరదతో నిండిపోయింది. ప్రధాన రహదారులు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇక ప్రముఖ ఇంద్రకీలాద్రి గుట్టపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై ఉన్న ప్రోటోకాల్ రూమ్‌పై భారీ బండరాళ్లు విరిగిపడటంతో అది ధ్వంసం అయింది. అయితే అధికారులు భారీ వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్డును ముందుగానే మూసివేయించడంతో.. బండరాళ్లు విరిగిపడిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇక భారీ వర్షాలతో ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఉన్న ఇళ్లపై కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. ఈ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటివరకు నాలుగుకు పెరిగింది. గుంటూరులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఇక ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తుండగా మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అలర్ట్ అయిన అధికారులు.. ఇంద్రకీలాద్రి సమీపంలో నివసిస్తున్న వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు.. భారీ వర్షాలకు బెజవాడ నగరం జలదిగ్భందంలో చిక్కుకుంది. కుంభవృష్టి వర్షాలతో విజయవాడ నగరం మొత్తం వరదలు పొంగుతున్నాయి. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు మొత్తం నీట మునగడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామవరప్పాడు రింగ్‌రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు అడ్డంకిగా మారింది. ఇక దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరగా.. బస్సులు, లారీ చిక్కుకున్నాయి. ఇక మంగళగిరి టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటితో టోల్ ప్లాజా మొత్తం జలాశయాన్ని తలపిస్తోంది.
ఈ భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిపై కలెక్టర్ సృజన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నారు. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్ 0863 2234014, 9849904013 లకు ఫోన్ చేయాలని సూచించారు.