ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకటి, రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయొచ్చని చెప్పారు. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావొద్దని.. ఎలాంటి టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు.
మరోవైపు ఏపీలో పింఛన్ల పంపిణీ వేగంగా సాగుతోంది. ఉదయం నుంచే నగదును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలు మినహా ఇతరచోట్ల పంపిణీ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 80శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. సెప్టెంబర్ 1న సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు అక్టోబర్ 2 నుంచి అర్హులైన వారికి కొత్త పింఛన్లు ఇస్తామని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అనర్హుల పింఛన్లు తొలగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో భారీవర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారుల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. నగరాల్లో, పట్టణాల్లో మ్యాన్‌హోల్, అలాగే కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలి అన్నారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని అధికారుల్ని ఆదేశించారు. వాగులు, వంకల దగ్గర అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్‌కు మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని అధికారులకు సూచించారు.
విజయవాడలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో మంత్రి నారాయణ అధికారుల్ని అప్రమత్తం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో ఫోన్‌లో మాట్లాడి.. కొన్ని సూచనలు చేశారు. నగరంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలకు ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.
ఏపీలోని వరద ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావొద్దని సూచించారు మంత్రి నారా లోకేష్.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ మెసేజ్‌లు గమనించి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి అన్నారు. కొండ చరియలు విరిగిపడే, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని.. అధికారులు సాయం అందించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పూర్తి సహకారం అందించాలని కోరారు.