ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమిత్ షాకు చంద్రబాబు ఫోన్,,,ఏపీకి 40 పవర్ బోట్లు, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 6 హెలికాప్టర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2024, 11:00 PM

ఎడతెరపి లేకుండా కురుస్తున్న అతిభారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ చిగురుటాకులా వణికిపోతోంది. అత్యంత భారీ వర్షపాతం.. వరదలతో విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. వేలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 30 ఏళ్లలో ఇంతటి బీభత్సం ఇదే మొదటిసారి వచ్చిందంటే.. పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబే స్వయంగా వెళ్లి.. వరద నీళ్లలో బోటుపై వెళ్తూ.. బాధితులను పరామర్శించి.. భయపడొద్దని.. ధైర్యం చెప్పి వచ్చారు. అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్థుత దయనీయ పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరించారు.


ఏపీలోని ప్రస్థుత పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు మాట్లాడారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మంది బాధితులను కాపాడేందుకు కేంద్రం సాయాన్ని బాబు కోరారు. దీంతో.. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని బాబుకు అమిత్ షా హామీ ఇచ్చారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు కావాలని అడగటంతో.. అమిత్‌ షా వెంటనే ఒప్పుకున్నారు. 40 పవర్ బోట్లను, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు కేంద్ర హోం సెక్రటరీ తెలిపారు. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లో 25 మంది సిబ్బంది ఉంటారని.. ఒక్కో టీంకు 4 పవర్ బోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. ఇవన్నీ రేపు (సెప్టెంబర్ 2న) ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని హోం సెక్రటరీ తెలిపారు.


వాయు మార్గంలో మరో 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపారు. సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపనున్నట్టు పేర్కొన్నారు. రేపటి నుంచే హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటాయని తెలిపారు.


మరోవైపు.. వరదలపై సమీక్షించిన సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరదల వల్ల ఆస్తి నష్టం, పంటలు బాగా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టామన్నారు. 107 క్యాంపులు పెట్టామని.. 17,000 మందిని క్యాంపులకు తరలించామన్నారు. అన్ని చోట్ల ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. పంటలు దెబ్బతిన్న చోట్లకు 8 మోటరైజ్డ్ బోట్లను పంపించామన్నారు. రెండు చాపర్లు కూడా పని చేస్తున్నాయని తెలిపారు. ప్రాణ నష్టం లేకుండా చూస్తామన్నారు.


మరోవైపు.. రిహాబిలిటేషన్ చర్యలు కూడా చేపడతామని చంద్రబాబు తెలిపారు. పరిహారం అందించే ప్రక్రియ ప్రారంభిస్తామని.. పరిహారం కూడా పెంచామని తెలిపారు. ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యం, ఒక కేజీ పప్పు, ఒక కేజీ పంచదార, ఒక కేజీ ఉల్లిపాయలు, ఒక కేజీ పొటాటో, ఒక కేజీ ఆయిల్.. ఈ ఐదు వస్తువులు ఇస్తామన్నారు. వీవర్స్‌కు పనులు ఒకట్రెండు నెలలు ఉండవన్న ఉద్దేశంతో వారికి అదనంగా మరో 25 కేజీల బియ్యం అందిస్తామని తెలిపారు. మత్స్యకారుల కూడా అదనంగా మరో 25 కేజీల బియ్యం అందిస్తాన్నారు. గతంలో లేని విధంగా 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించామన్నారు. వీలైనంత త్వరగా బాధితులకు ఇవన్నీ పంపిణీ చేస్తామని.. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com